
అయోధ్య, 22 జూన్ (హి.స.) అయోధ్య ఆలయంలో శ్రీరాముడి పాదుకలు, మెడలోని హారం దొంగతనానికి గురయ్యాయనే ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అధికార బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రామాయణంలో భరతుడు శ్రీరాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి 14 ఏళ్లపాటు అయోధ్యను పరిపాలించాడని, కానీ బీజేపీకి చెందిన కొందరు వ్యక్తులు ఆ పాదుకలనే దొంగిలించారని ఆయన మండిపడ్డారు. రామాలయానికి సంబంధించి గతంలో రూ. 2 కోట్ల విలువైన భూమిని రూ. 18.5 కోట్లకు, రూ. 3 కోట్ల భూమిని రూ. 24 కోట్లకు కొనుగోలు చేస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. విరాళాల పెట్టెలు, పవిత్రమైన రాతి శిలల దొంగతనం వంటి ఘటనలు ఇప్పటికే కోట్ల మంది హిందువుల మనోభావాలను గాయపరిచాయని, ఇప్పుడు సాక్షాత్తూ దేవుడి పాదుకలు, హారాన్ని కూడా వదల్లేదని ధ్వజమెత్తారు. ఇలాంటి పనులకు పాల్పడుతున్న 'చందా చోర్' (విరాళాల దొంగలు) వ్యక్తులకు అధికారంలో కొనసాగే హక్కు లేదని, దేశ ప్రజలు దీనిపై గళమెత్తాలని సంజయ్ సింగ్ పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi