
కాకినాడ, 23 జూన్ (హి.స.)
టీడీపీ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేరుతో నకిలీ టీటీడీ లేఖ కలకలం రేపుతోంది. టీటీడీ దర్శనం కోసం ఎమ్మెల్సీ లెటర్ హెడ్తో నకిలీ సిఫార్స్ లేఖ తయారు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. ఈ వ్యవహారంపై కాకినాడ సర్పవరం స్టేషన్లో ఎమ్మెల్సీ రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. అప్పన్న అనే వ్యక్తి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి టీటీడీ లేఖ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 25న తిరుమల శ్రీవారి దర్శనం కోసం నకిలీ లేఖ సిఫార్సు చేశారని వెల్లడించారు.
అప్పన్న అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా ఎమ్మెల్సీ ఫిర్యాదు చేశారు. తన పేరు, హోదా, సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను రూపొందించిన వ్యక్తిపై సమగ్ర విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్సీ రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ