స్పార్క్ కార్యక్రమం అభినందనీయం.. డి ఐ జి చౌహన్
స్పార్క్ కార్యక్రమం అభినందనీయం.. డి ఐ జి చౌహన్
Dig


సంగారెడ్డి, 23 జూన్ (హి.స.)

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పోలీసు సిబ్బంది పిల్లల కోసం ఏర్పాటు చేసిన గ్రంథాలయం ఎంతో ఉపయుక్తమని, ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పార్క్ కార్యక్రమం అభినందనీయమని మల్టీ జోన్-VII, జోగులాంబ డీఐజీ ఎల్ఎస్. చౌహాన్పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని మంగళవారం సందర్శించిన ఆయనకు జిల్లా పోలీసు బృందం గౌరవ వందనం సమర్పించింది. కార్యాలయ ఆవరణలో మొక్కను నాటిన అనంతరం డీఐజీ చౌహాన్ పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల పిల్లల కోసం ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఇన్చార్జ్ జోన్-VI, చార్మినార్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ఆయన జిల్లా పోలీసు యంత్రాంగం పనితీరును సమీక్షించారు. స్పార్క్ కార్యక్రమం ద్వారా పోలీసు సిబ్బంది, వారి పిల్లలు అన్ని రంగాల్లో రాణించే అవకాశం లభిస్తుందని డీఐజీ అన్నారు. గ్రంథాలయం ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అవసరమైన విజ్ఞానం, మార్గదర్శకత్వం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని సిబ్బంది, వారి పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కార్యాలయంలోని పలు విభాగాలను సందర్శించిన డీఐజీ సెక్షన్ల పనితీరు, రికార్డుల నిర్వహణ, ప్రజా సేవలను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలోని నిబద్ధతను అభినందించారు. సీసీటీఎన్ఎస్ నిర్వహణ, డేటా నమోదు, కేసుల అప్డేషన్, నేరస్తుల సమాచార సేకరణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై కీలక సూచనలు చేశారు. ప్రతి కేసు వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్లో నమోదు చేయడంతో పాటు డేటా నాణ్యత మెరుగుపరచాలని ఆదేశించారు. సాంకేతికతతో దర్యాప్తు వేగవంతం కావడంతో పాటు నేర నియంత్రణలో మెరుగైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా సేవలు అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అడ్మినిస్ట్రేషన్ అధికారి పద్మావతి, డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, కార్యాలయ ఇన్స్పెక్టర్లు, ఆస్ఐలు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande