
మంచిర్యాల, 23 జూన్ (హి.స.)
యువత మాదకద్రవ్యాలకు బానిసలై
తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్మిక, భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో స్థానిక సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి ఎన్నో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.
తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలను చదివిస్తూ ఉన్నత పదవులు పొందాలని ఆశిస్తున్న తరుణంలో, యువత మత్తుకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నియోజకవర్గంలో మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడిక పై నిఘా పెట్టాలని సూచించారు. అనంతరం నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..