
భీమవరం గ్రామీణ, 10 జూలై (హి.స.)
భీమవరం మండలం తాడేరుకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని కొత్తపల్లి అనంతవాణి(32) ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కొర్రపాడుకు చెందిన తాడేపల్లి శ్యాంబాబును అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ రఘువీర్విష్ణు రూరల్ పోలీస్స్టేషనులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విప్రో సంస్థలో పని చేసే అనంతవాణి తన తల్లికి అనారోగ్యంతో ఉండటంతో సేవలందించేందుకు సొంతూరికి వచ్చి ఏడాదిగా వర్క్ ఫ్రం హోం విధానంలో విధులు నిర్వహిస్తుందన్నారు. ఈ క్రమంలో శ్యాంబాబుతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అతడికి గతంలోనే వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారనే విషయం తెలిసిన అనంతవాణి అతడి నుంచి వచ్చిన వివాహ ప్రతిపాదనను పక్కన పెట్టింది. అతడి ఫోన్కాల్స్కు స్పందించడం మానేసింది. దాంతో కక్ష పెంచుకున్న శ్యాంబాబు ఈనెల నాలుగో తేదీ అర్ధరాత్రి అనంతవాణి ఇంటికి వెళ్లి పదునైన కత్తితో ఆమెపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్లో పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అతడ్ని పట్టుకున్నామని, కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారని డీఎస్పీ వెల్లడించారు. కేసు దర్యాప్తులో రూరల్ పోలీసులు బాగా పని చేశారని ప్రశంసించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ