అమరావతికి 'శాంసంగ్ సిటీ'.. కొరియా కంపెనీలతో మంత్రి లోకేశ్ కీలక భేటీలు
అమరావతికి 'శాంసంగ్ సిటీ'.. కొరియా కంపెనీలతో మంత్రి లోకేశ్ కీలక భేటీలు
Lokesh


అమరావతి, 10 జూలై (హి.స.)

ఆంధ్రప్రదేశ్‌ను అత్యాధునిక సాంకేతికత, పారిశ్రామిక పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తన దక్షిణ కొరియా పర్యటనలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (బీఈఎస్ఎస్‌) తయారీలో పేరొందిన డెల్టా ఎక్స్, ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కంపెనీల ఉన్నతాధికారులతో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. ఏపీలో భారీ ఎత్తున తయారీ, పరిశోధన యూనిట్లను స్థాపించాలని ఆయన ఈ కంపెనీలను ఆహ్వానించారు.

ఏపీలో బ్యాటరీ యూనిట్‌కు డెల్టా ఎక్స్ సానుకూలం

సియోల్‌లో డెల్టా ఎక్స్ (DeltaX) ఫౌండర్, సీఈవో స్టీఫెన్ కిమ్‌తో మంత్రి లోకేశ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ, 25 గిగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుల లక్ష్యంతో ముందుకు సాగుతోందని వివరించారు. ఈ ప్రణాళికలకు అనుగుణంగా రాష్ట్రంలో సోలార్ మాడ్యూళ్లు, బ్యాటరీ సెల్స్ తయారీకి అనువైన పర్యావరణాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. పోర్టులు, మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్న ఏపీలో ఒక బీఈఎస్ఎస్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆయన డెల్టా ఎక్స్‌ను కోరారు. దీనికి డెల్టా ఎక్స్ సీఈవో స్టీఫెన్ కిమ్ సానుకూలంగా స్పందించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో తయారీ యూనిట్ ఏర్పాటుపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన మంత్రికి తెలిపారు.

శాంసంగ్‌కు భారీ ప్రతిపాదనలు

అనంతరం, ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ జో యున్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తూ పలు ప్రతిపాదనలు చేశారు.

ఏఐ, డేటా సెంటర్ హబ్: రాష్ట్రంలోని 10 గిగావాట్ల డేటా సెంటర్ పైప్‌లైన్‌ను ఉపయోగించుకుని, ఏఐ-కంప్యూట్, సర్వర్ తయారీ, సర్వీసింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ను శాంసంగ్‌కు ప్రధాన కేంద్రంగా మార్చాలని లోకేశ్ కోరారు.

తయారీ యూనిట్లు: ఏపీలో ఒక డిస్‌ప్లే ఫ్యాబ్, విశాఖపట్నంలోని ఐఎస్ఎం ఓఎస్ఏటీ క్లస్టర్‌ను ఆధారంగా చేసుకుని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ కోసం ఒక సెమీకండక్టర్ యూనిట్ (ఓఎస్ఏటీ) ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, రాష్ట్ర పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు మద్దతుగా మొబైల్, డివైస్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

అమరావతిలో భాగస్వామ్యం: రాజధాని అమరావతి నిర్మాణం, పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనలో శాంసంగ్ భాగస్వామి కావాలని ఆహ్వానించారు. అమరావతి క్వాంటం వ్యాలీలో శాంసంగ్ ఆర్&డీ విభాగాన్ని నెలకొల్పాలని సూచించారు.

శాంసంగ్ సిటీ: వీటన్నిటికీ మించి శాంసంగ్ బహుళ విభాగాలకు ఒకేచోట నిలయంగా ఉండేలా ఏపీలో ఒక ప్రత్యేక 'శాంసంగ్ సిటీ'ని నిర్మించాలన్న భారీ ప్రతిపాదనను కూడా లోకేశ్ వారి ముందుంచారు.

మంత్రి లోకేశ్‌ చేసిన ఈ ప్రతిపాదనలపై శాంసంగ్ ప్రతినిధులు స్పందిస్తూ, తమ సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు. మొత్తం మీద, గ్రీన్ ఎనర్జీ, హై-టెక్ తయారీ రంగాలలో కొరియా దిగ్గజాలను ఏపీకి ఆకర్షించేందుకు మంత్రి లోకేశ్‌ చేసిన ఈ ప్రయత్నాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా డెల్టా ఎక్స్ నుంచి సానుకూల స్పందన రావడం రాష్ట్రానికి శుభపరిణామంగా భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande