పుంగనూరులో ఈవీ క్లస్టర్.. ప్రతి 30 కి.మీ.కు ఛార్జింగ్ స్టేషన్: మంత్రి లోకేశ్
పుంగనూరులో ఈవీ క్లస్టర్.. ప్రతి 30 కి.మీ.కు ఛార్జింగ్ స్టేషన్: మంత్రి లోకేశ్
nara


హైదరాబాద్, 10 జూలై (హి.స.)

ఆంధ్రప్రదేశ్ను ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగంలో దేశానికే హబ్గా మార్చేందుకు పటిష్టమైన ప్రణాళికలతో ముందుకెళుతున్నామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సుస్థిర ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 కింద రాష్ట్రంలో విస్తృతమైన ఈవీ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రయాణంలో భాగస్వాములు కావాలని కొరియన్ సంస్థలను ఆయన ఆహ్వానించారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్, సియోల్లో కొరియా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ (కేఏఐసీఏ) ఛైర్మన్ టేక్-సుంగ్ లీ నేతృత్వంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈవీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈవీ ఎకోసిస్టమ్లో భాగంగా పూర్తిస్థాయిలో ఏపీఎస్ఆర్టీసీ బస్సులను విద్యుదీకరించడం, గ్రీన్ కారిడార్లలో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం, పుంగనూరులో ప్రత్యేక ఈవీ క్లస్టర్ను నెలకొల్పడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ-మొబిలిటీ నగరాల అభివృద్ధికి, ఈవీ పరిశోధనలకు ప్రత్యేక గ్రాంట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా, ఈవీ బ్యాటరీలు, మాగ్నెట్ల తయారీకి అవసరమైన ముడిసరుకుల కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో ఒక 'రేర్ ఎర్త్ కారిడార్' ఏర్పాటు చేయబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande