ఐఎస్ఐ హ్యాండ్లర్ శహజాద్ భట్టీతో సంబంధాలు: మహారాష్ట్రలో పలుచోట్ల ఏటీఎస్ విస్తృత సోదాలు
ఐఎస్ఐ హ్యాండ్లర్ శహజాద్ భట్టీతో సంబంధాలు: మహారాష్ట్రలో పలుచోట్ల ఏటీఎస్ విస్తృత సోదాలు
ATS


ముంబై (మహారాష్ట్ర), 10 జూలై (హి.స.)

పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ (ISI) హ్యాండ్లర్, కు ప్రఖ్యాత గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టీతో సోషల్ మీడియా ద్వారా సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానంతో మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సోదాలు చేపట్టింది. శుక్రవారం ఉదయం నుంచే ముంబైతో పాటు థానే, కుర్లా, బాంద్రా, జోగేశ్వరి, నవీ ముంబై, మీరా రోడ్, భయాందర్, సాంగ్లీ, సతారా, ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) వంటి పలు ప్రధాన నగరాల్లోని దాదాపు 150 కి పైగా ప్రాంతాలలో ఏటీఎస్ బృందాలు ఏకకాలంలో ఈ తనిఖీలను నిర్వహిస్తున్నాయి. పాక్ హ్యాండ్లర్ భట్టీతో టచ్‌లో ఉన్న పలువురు అనుమానితులను గుర్తించి, వారి డిజిటల్ పరికరాలు మరియు సోషల్ మీడియా ఖాతాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బుధవారం నాడు దేశ రాజధానితో పాటు పంజాబ్‌లో షహజాద్ భట్టీ నెట్‌వర్క్‌కు చెందిన రెండు మోడ్యూళ్లను విజయవంతంగా బేధించి, ఆరుగురు ఉగ్రవాద అనుమానితులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర ఏటీఎస్ ఈ తనిఖీలను వేగవంతం చేసింది.

ఢిల్లీలో పట్టుబడిన నిందితులను విచారించగా, భట్టీ ఆదేశాల మేరకు దేశ రాజధానిలోని న్యూ పోలీస్ లైన్స్ (సివిల్ లైన్స్), ఆనంద్ విహార్ బస్ టెర్మినల్ (ISBT), ఒక రైల్వే స్టేషన్ మరియు రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాలలో పెట్రోల్ బాంబులతో దాడులు చేయడానికి వారు ప్లాన్ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితుల మొబైల్ ఫోన్లలో సదరు కీలక ప్రాంతాలకు సంబంధించిన రెక్కీ వీడియోలు లభ్యమవగా, వాటిని నిషేధిత మెసేజింగ్ యాప్ ద్వారా పాకిస్తాన్‌కు పంపినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కుట్రలో భాగంగా ఢిల్లీలోని విజయ్ ఘాట్ (రాజ్‌ఘాట్ వెనుక) ప్రాంతంలో దాచి ఉంచిన పెట్రోల్ బాంబులను కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ప్రధాన నిందితుడు డానిష్ అలియాస్ చంద్ మియాన్‌కు దాడులు జరిపినందుకు గానూ రూ.20,000 ఇస్తామని భట్టీ ఆశ చూపగా, దాడులను వీడియో తీసి పాకిస్తాన్‌కు పంపే బాధ్యతను సల్మాన్ అనే మరో నిందితుడికి అప్పగించారు. అలాగే డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ నుండి సరిహద్దులు దాటి వచ్చిన ఆయుధాలను ముఠా సభ్యులకు సరఫరా చేయడంలో మల్కీత్ సింగ్, తయ్యబ్, జుబైర్ ఖాన్, అలీ ఫజల్ వంటి వారు కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ సీమాంతర ఉగ్రవాద నెట్‌వర్క్ మరియు ఐఎస్ఐ హ్యాండ్లర్లతో మహారాష్ట్రలోని యువతకు ఉన్న సంబంధాలపై మరింత సమాచారం సేకరించేందుకు ఏటీఎస్ విచారణను ముమ్మరం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande