
హైదరాబాద్, 14 జూలై (హి.స.)
హార్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన ‘ఎంటి అల్ బాహియా’, ‘ఎంటి మొంబాసా’ చమురు ట్యాంకర్లపై జరిగిన క్షిపణి దాడుల పట్ల భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ఒక భారతీయ నావికుడు మరణించగా, మరో పది మంది గాయపడ్డారని, మొత్తం 30 మంది భారతీయ సిబ్బందిపై ఈ ప్రభావం పడిందని MEA అధికారికంగా ధృవీకరించింది. భారత్ ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ, ఇరాన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్‌కు సమన్లు జారీ చేసి నిరసన తెలిపింది. దాడులకు గురైన ‘ఎంటి అల్ బాహియా’ (MT Al Bahiyah) మరియు ‘ఎంటి మొంబాసా’ (MT Mombasa) రెండు నౌకలలో కలిపి మొత్తం 46 మంది సిబ్బంది ఉండగా, వారిలో 30 మంది భారతీయులే ఉన్నారు.
ఎంటి అల్ బాహియా నౌకలో 12 మంది భారతీయ నావికులు ఉండగా.. వీరిలో ఒకరు విషాదకరంగా మరణించారు, మరొకరు గాయపడ్డారు.
ఎంటి మొంబాసా ....ఈ నౌకలో 18 మంది భారతీయులు ఉండగా.. దాడి కారణంగా వీరిలో 9 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
ఒమన్ ప్రాంతీయ జలాల్లోని హార్ముజ్ జలసంధి దక్షిణ మార్గంలో ప్రయాణిస్తున్న ఈ యూఏఈ చమురు ట్యాంకర్లపై ఇరాన్ క్రూయిజ్ క్షిపణులతో (Iranian Cruise Missiles) ఈ దాడులకు పాల్పడినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్షిపణి దాడుల తాకిడికి రెండు నౌకలలోనూ భారీగా మంటలు చెలరేగగా, సిబ్బంది వాటిని అదుపులోకి తెచ్చారు
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని ఇరాన్ దౌత్య కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ 'మహమ్మద్ జవాద్ హొస్సేనీ'ని విదేశాంగ శాఖ నేరుగా పిలిపించి (Summoned) తన అత్యంత బలమైన నిరసనను నమోదు చేసింది. అంతర్జాతీయ జలమార్గాల్లో వాణిజ్య నౌకలపై, నావికులపై జరుగుతున్న ఇలాంటి హింసాత్మక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది యూఏఈలోని భారత రాయబార కార్యాలయం (Indian Mission) అక్కడి అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, గాయపడిన భారతీయ నావికులకు అవసరమైన అన్ని రకాల వైద్య, అత్యవసర సహాయాలను అందిస్తోంది
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi