ఉడాన్ పథకం మరో పదేళ్లు పొడిగిస్తున్నాం: రామ్మోహన్
ఉడాన్ పథకాన్ని మరో పదేళ్లు పొడిగిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
Rammohan naidu


ఢిల్లీ, 14 జూలై (హి.స.)ఉడాన్ పథకాన్ని మరో పదేళ్లు పొడిగిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) స్పష్టం చేశారు. రూ.30 వేల కోట్లతో 100 కొత్త ఎయిర్పోర్టులు, 200 హెలిపోర్టులే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. భారత్ను ప్రపంచ ఏవియేషన్ హబ్గా తీర్చిదిద్దడమే కేంద్ర లక్ష్యమని ఉద్ఘాటించారు. 2028 జూన్ 2వ తేదీ నాటికి వరంగల్ ఎయిర్పోర్ట్ను పూర్తి చేయడమే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఈరోజు (మంగళవారం) ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుని కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో రామ్మోహన్ మాట్లాడారు.

బెస్ట్ ఎయిర్పోర్ట్గా మామునూరును తీర్చిదిద్దుతాం..

బెస్ట్ ఎయిర్పోర్ట్గా మామునూరును తీర్చిదిద్దుతామని రామ్మోహన్ పేర్కొన్నారు. తన హయాంలోనే మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. వరంగల్ ఎయిర్పోర్ట్ పనులను వేగవంతం చేయాలని తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. బౌండరీ వాల్, రన్వే టెండర్లు సిద్ధం చేశామని వెల్లడించారు. 3 నుంచి 4 వారాల్లో టెర్మినల్ భవనం టెండర్లు పిలుస్తామని వివరించారు. కాకతీయ కళావైభవాన్ని ప్రతిబింబించే విధంగా టెర్మినల్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. దేశంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా వరంగల్ను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

ఆదిలాబాద్ ప్రాజెక్ట్కు సుమారు 1,500 ఎకరాల భూసేకరణ చేయాలి..

రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాల భూమిని రికార్డు సమయంలో అప్పగించిందని రామ్మోహన్ తెలిపారు. వరంగల్ ప్రాజెక్టులో ఎలాంటి జాప్యం లేదని స్పష్టం చేశారు. ఆదిలాబాద్లో డిఫెన్స్ - సివిలియన్ ఎయిర్పోర్ట్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయని వెల్లడించారు. ఆదిలాబాద్ ప్రాజెక్ట్కు సుమారు 1,500 ఎకరాల భూసేకరణ చేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వేగంగా భూమి ఇవ్వడంతో ఆ ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెరిగిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande