
బళ్ళారి, 14 జూలై (హి.స.)తుంగభద్ర జలాలపై కేంద్ర జలశక్తి శాఖ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. తుంగభద్ర రిజర్వాయర్లో పూడిక తీత, నావలి రిజర్వాయర్, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) ఆధునికీకరణ అంశాలపై కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కమిటీకి కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ)లోని మెంబర్(డబ్ల్యూపీఅండ్పీ) చైర్మన్గా ఉంటారు. కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి, ఏపీ ఈఎన్సీ, తెలంగాణ ఈఎన్సీ, సీడబ్ల్యూసీలోని చీఫ్ ఇంజనీర్ (ఐఎంవో), చీఫ్ ఇంజనీర్ (డిజైన్స్), చీఫ్ ఇంజనీర్ (హెచ్ఎ్సవో), చీఫ్ ఇంజనీర్ (ఈఎంవో), తుంగభద్ర బోర్డు కార్యదర్శి, మెంబర్ కన్వీనర్/మెంబర్ సెక్రటరీలుగా ఉంటారు. ఈ కమిటీ ఆరు అంశాలపై చర్చించి, ఆర్నెల్లలో కేంద్ర జలశక్తి శాఖకు నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఇటీవల తుంగభద్ర జలాశయం 33 గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా రిజర్వాయర్లో పూడికతీత, నావలి రిజర్వాయర్, ఆర్డీఎస్ ఆధునికీకరణపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమావేశమై.. ఓ కమిటీ వేసి, అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించిన సంగతి తెలిసిందే. తుంగ భద్ర జలాల్లో 230 టీఎంసీల మేరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయింపులున్నాయి. గడిచిన 44 ఏళ్లలో 230 టీఎంసీల నీటిని ఒక్క ఏడాది కూడా వాడుకోలేదని, జలాశయంలో పూడిక పేరుకుపోవడమే దీనికి కారణమని గుర్తించారు.
పూడిక తీయడంతో పాటు తుంగభద్రపై కొప్పాల్ జిల్లాలోని నావలి వద్ద 52 టీఎంసీలతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని కర్ణాటక ప్రతిపాదిస్తోంది. పూడిక వల్ల జలాశయం సామర్థ్యం 30 టీఎంసీల మేర తగ్గిందని, దానివల్ల వాటా మేరకు నీటిని పొందలేకపోతున్నామని కర్ణాటక చెబుతోంది. రిజర్వాయర్ నిర్మాణానికి ఏపీ సర్కారు అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే, కొత్త రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం మేరకు నీటిని తుంగభద్ర రిజర్వాయర్లో వదిలేయాలన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదనకు కర్ణాటక సమ్మతించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలన్నింటిపైనా ఉన్నత స్థాయి కమిటీ కసరత్తు చేయనుంది.
కమిటీకి అప్పగించిన ఆరు అంశాలు..
ఆర్డీఎస్ కింద నీటి వినియోగం, అవరాలు, నిర్వహణలో ఇబ్బందులు, ప్రస్తుత పరిస్థితిపై అధ్యయనం చేయాలి.
తుంగభద్ర రిజర్వాయర్లో పూడిక ఏ మేరకు చేరిందనే దానిపై అంచనా వేయాలి. దానివల్ల నీటి నిల్వ సామర్థ్యంపై పడిన ప్రభావం; సాగు, తాగునీరు, జలవిద్యుత్ ఉత్పత్తిపై పడే ప్రభావాన్ని అంచనా వేసి.. డ్యామ్ సేఫ్టీ, వరద పరిస్థితులను పరిశీలించాలి.
తుంగభద్రలో పూడిక తీయడానికి ఉన్న సాంకేతిక, ఆర్థిక అవకాశాలను పరిశీలించాలి. రిజర్వాయర్లో పూడిక చేరకుండా ఏంచేయాలనే అంశాన్ని కూడా పరిశీలించాలి.
తుంగభద్రలో పూడికతో నీటి నిల్వ సామర్థ్యం కోల్పోయినందున నావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టాల్సిన అవసరం ఉందా? లేదా? అన్న అంశంపై అధ్యయనం చేయాలి.
తుంగభద్ర రిజర్వాయర్లో పూడిక తీయడం వల్ల ప్రయోజనం ఉంటుందా? సమాంతరంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టడం వల్ల మేలు జరుగుతుందా? వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల దిగువ ప్రాంతానికి సహేతుకంగా నీరు విడుదల అవుతుందా? లేదా? వంటి అంశాలు పరిశీలించాలి.
కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రైబ్యునల్ తీర్పులకు లోబడి ప్రభావిత రాష్ట్రాలకు వాటా మేరకు నీరందే అవకాశం ఉంటుందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించాలి.
ఉన్నతస్థాయి కమిటీ అవసరమైతే ఉప కమిటీలు వేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ కమిటీల్లో ప్రత్యేక ఆహ్వానితులను అవసరమైన మేరకు నియమించుకోవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV