
అమరావతి, 15 జూలై (హి.స.)
రెండేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై రూ.24వేల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. మార్చి 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. పెన్నా-వంశధార నదుల అనుసంధానం చేయాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. నదుల అనుసంధానం పూర్తి చేస్తే.. రాష్ట్రానికి కరవు ఉండదని స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో రూ.35వేల కోట్లు ఖర్చు చేసి.. 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. గంగా-కావేరి నదుల అనుసంధానం చేయగలిగితే దేశానికి తిరుగుండదన్నారు. గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు ఈనెలలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయ్యాయని, ఆగస్టు 14న అనకాపల్లిలో గోదావరి జలాలకు జలహారతి ఇస్తామని ప్రకటించారు. సెప్టెంబరు 1న వెలిగొండ ఫేజ్-1 ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ