
అమరావతి, 15 జూలై (హి.స.)
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కృష్ణా- గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో కృష్ణవేణి - గోదావరి నదుల సంగమ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జలాలకు పుష్పమాల, వస్త్రాలు, పసుపు- కుంకుమ సమర్పించారు. కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి ఇచ్చారు. ఆపై ప్రముఖ ఇంజినీర్ కేఎల్ రావు 124వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ఇంజినీర్గా కేఎల్ రావు స్ఫూర్తి ప్రతి గ్రామానికీ తీసుకెళ్లేలా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు చేరి ఈ డెల్టాను సస్యశ్యామలం చేస్తున్నాయన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్లకు కృష్ణా నది నుంచి నీటి ప్రవాహం తగ్గిందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ