
అనకాపల్లి, జులై 15 (హి.స)
, :సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు చాలా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. సైబర్ నేరాలపై ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బుధవారం అనకాపల్లి జిల్లాలోని వేంపాడు టోల్ ప్లాజా సమీపంలోని భారతి కన్వెన్షన్లో అభయ కార్యక్రమాన్ని హోం మంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా అభయ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళల భద్రత - మా బాధ్యత అంటూ అనకాపల్లి పోలీసులు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్నో పోరాటాలు వలన మహిళలకు స్వేచ్ఛ వచ్చిందని గుర్తు చేశారు. మహిళలకు ధైర్యం కల్పించడానికి.. అభయ కార్యక్రమాన్ని పోలీసులు ప్రారంభించారని తెలిపారు.
చట్టాలపై అందరికీ అవగాహన ఉండాలని మంత్రి అనిత అభిప్రాయపడ్డారు. శక్తి యాప్, శక్తి టీమ్స్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. పిల్లలను తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని అన్నారు. కష్టపడి చదువుకొని, ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఈ సందర్భంగా పిల్లలకు ఆమె సూచించారు. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పడితే తక్షణమే 112కి కాల్ చేయాలని అన్నారు. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని వివరించారు. బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి అంటూ పిల్లలకు హోం మంత్రి అనిత హితవు పలికారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని వారికి స్పష్టం చేశారు.
ఒకటే జీవితం.. దానిని ఆనందంగా మార్చుకోవాలని పిల్లలకు ఏపీ హోం మంత్రి సూచించారు. పిల్లల ప్రవర్తనపై నిత్యం దృష్టి పెట్టాలని తల్లిదండ్రులకు వివరించారు. మీ జీవితాల్లో చదువు మాత్రమే మార్పు తీసుకొస్తుందని అన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలల్లో కూడా అభయ ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అనకాపల్లి జిల్లాలో పెద్ద సంఖ్యలో డ్రోన్లు వినియోగిస్తున్నామని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ