
ఆదిలాబాద్, 15 జూలై (హి.స.)
విద్యార్థులు సోషల్ మీడియా, ఇతరసామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండి చదువుపై పూర్తి దృష్టి సారించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బుధవారం సోనాల మండల కేంద్రంలోని పీఎం శ్రీ జడ్పీ సెకండరీ పాఠశాలలో నిర్వహించిన 'ఆరోగ్య పాఠశాల' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం రాగి జావ వంటి పౌష్టికాహారం అందించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థినుల్లో రక్తహీనత నివారణకు రాగి జావ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
జంక్ ఫుడ్, చిప్స్ వంటి అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్లను కేవలం చదువు కోసమే వినియోగించాలని, రీల్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ రెడ్రెస్సల్ కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో వచ్చే ఫిర్యాదులను ప్రధానోపాధ్యాయులతో కలిసి కమిటీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..