
ఢిల్లీ, 15 జూలై (హి.స.)ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఆస్తి వేలం వివాదం కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గణేశ్ తన ఆస్తి వేలం వ్యవహారంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్యలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టు వెళ్లారు. హైదరాబాద్కు చెందిన మెస్సర్స్ శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్కు యూనియన్ బ్యాంక్ అందించిన రుణాలకు గానూ, బండ్ల గణేశ్ ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత ఆస్తులను పూచీకత్తుగా తాకట్టు పెట్టారు. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ సమయంలో, బ్యాంక్ తనఖా పెట్టిన ఆస్తిని SARFAESI చట్టం కింద వేలం వేసింది. ఈ వేలం ప్రక్రియను సవాలు చేస్తూ బండ్ల గణేశ్ డెబ్ట్స్ రికవరీ ట్రిబ్యునల్ (DRT-II)ను ఆశ్రయించగా, అది ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
వేలం ప్రక్రియ నిలవదని పేర్కొంటూ, ఆస్తిని తిరిగి యజమానులకు అప్పగించాలని, కొనుగోలుదారుకు సొమ్మును వడ్డీతో సహా వాపసు చేయాలని డీఆర్టీ (DRT) ఆదేశించింది. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ బ్యాంక్ తెలంగాణ హైకోర్టుకు వెళ్లింది. డీఆర్టీ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేస్తూ బ్యాంక్ చర్యను సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బండ్ల గణేశ్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేశారు. ఈ కేసు వచ్చే సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్