
హైదరాబాద్, 15 జూలై (హి.స.) జర్నలిస్టుల సమస్యల సాధన కోసం కలం కదం తొక్కింది. తమ దీర్ఘకాలిక సమస్యలను, న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో ఇవాళ (బుదవారం) హైదరాబాద్లోని సమాచార, పౌరసంబంధాల శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఎదుట జర్నలిస్టులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ పి. రాంచందర్, ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య పాల్గొని ప్రసంగించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తమ యూనియన్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలుమార్లు దశలవారీగా ఆందోళనలు చేపట్టామని వారు గుర్తుచేశారు. ఇన్ని పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి గానీ, అధికారుల నుంచి గానీ కనీస స్పందన రాకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులను సమీకరించి, పెద్ద ఎత్తున ఈ ఆందోళనకు దిగినట్లు వారు స్పష్టం చేశారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం ఇకనైనా సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..