
హైదరాబాద్, 15 జూలై (హి.స.)తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరింది. ఈ విషయంపై మీనాక్షి నటరాజన్తో ఇవాళ మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఆమె ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కడియం తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, అనవసర వివాదాల్లోకి లాగుతున్నారని మీనాక్షి నటరాజన్ దృష్టికి సురేఖ తీసుకెళ్లారు.
అలాగే ఇద్దరి మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించిన అన్ని అంశాలను నటరాజన్కు వివరించారు. మంత్రి సురేఖ వివరించిన అన్ని అంశాలను ఓపికగా విన్న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సంయమనం పాటించాలని మంత్రికి సూచించారు. అయితే, తన పని తాను చేసుకుంటుంటే అనవసరంగా బయటకు రప్పిస్తున్నారని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిన్నచిన్న విషయాలను పెద్దగా పట్టించుకోవద్దని సురేఖకి మీనాక్షి నటరాజన్ సూచించారు. కాగా, ఈ వివాదంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ను కలిసి ఎమ్మెల్యే కడియంపై మంత్రి సురేఖ ఫిర్యాదు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్