
హైదరాబాద్, 15 జూలై (హి.స.)రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీబీజీ రామ్జీ పథకం ఈ నెలారంభం నుంచి అమలులోకి రావడం, 16వ కేంద్ర ఆర్థిక సంఘం మార్గదర్శకాలు వెలువడటం, పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పడటం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని తాజాగా పంచాయతీలలో అన్ని వివరాల నమోదు చేపట్టాలని ఆదేశాలిచ్చింది. జిల్లా పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారుల పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శుల ద్వారా నెలాఖరు వరకు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సూచించింది. పంచాయతీ పేరు, కోడ్, వైశాల్యం, జనాభా, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, పెన్షనర్లు, దివ్యాంగులు, శివారు ప్రాంతాలు, మండల, శాసనసభ, పార్లమెంటు నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర సిబ్బంది, మొబైల్ నంబర్లు, గృహాలు, కుటుంబాలు, రేషన్ కార్డుదారులు, రైతులు, భూముల వివరాలు, పంచాయతీ సొంతస్థలాలు, నీటివనరులు, రహదారులు, నల్లాలు, బోర్లు, వీధిదీపాలు, విద్యుత్ సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, మహిళాసంఘాలు, మత్స్యసంఘాలు, ఉపాధి హామీ కూలీలు, మహిళాసంఘాలు, స్త్రీనిధి రుణాలు తదితరాల సమాచారం నమోదు చేయాలి. వచ్చే మూడేళ్ల కాలానికి పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, వార్షిక అంచనా బడ్జెట్లు, వాటిల్లో చేపట్టనున్న పనులు, ఇతర కార్యాచరణను రూపొందించాలని కూడా ప్రభుత్వం సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్