మూడు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం రేవంత్.. షెడ్యూల్ ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు.
Revanth reddy


హైదరాబాద్, 15 జూలై (హి.స.)తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. రంగారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో పర్యటించి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్కు సీఎం రేవంత్ భూమిపూజ చేయనున్నారు. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో అమరరాజా సెల్ తయారీ యూనిట్ను ప్రారంభించనున్నారు. అలాగే వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.

సీఎం రేవంత్ రెడ్డి అధికారిక పర్యటన షెడ్యూల్ ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 12:00 గంటలకు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీకి బయలుదేరుతారు. 12:15 గంటలకు ఫ్యూచర్ సిటీలోని అమెజాన్ డేటా సెంటర్ వేదికకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:15 నుంచి 12:45 గంటల మధ్య అమెజాన్ డేటా సెంటర్కు భూమిపూజ చేస్తారు. అనంతరం 12:50 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లికి పయనమవుతారు. మధ్యాహ్నం 1:15 గంటలకు దివిటిపల్లి చేరుకుని, 1:20 నుంచి 2:20 గంటల మధ్య అమరరాజా సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవం, ప్లాంట్ సందర్శన, అనంతరం ప్రసంగం చేయనున్నారు.

మధ్యాహ్నం 2:20 గంటలకు దివిటిపల్లి నుంచి వనపర్తి జిల్లా కొత్తకోటకు హెలికాప్టర్లో సీఎం రేవంత్ బయలుదేరుతారు. మధ్యాహ్నం 2:40 గంటలకు కొత్తకోటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2:45 నుంచి 3:45 గంటల మధ్య బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం 3:45 గంటలకు కొత్తకోట నుంచి హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande