సర్’పై నిర్లక్ష్యం చూపితే సహించేది లేదు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంపై నిర్లక్ష్యం చూపితే సహించేది లేదని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు.
Meenakshi natarajan


హైదరాబాద్, 15 జూలై (హి.స.)ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంపై నిర్లక్ష్యం చూపితే సహించేది లేదని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని తన కార్యాలయంలో ఆమె ఒక్కొక్కరితో ముఖాముఖి సమావేశమై.. ‘సర్’ అమలుతీరుపై క్షేత్రస్థాయి వివరాలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరికివారు సొంత కార్యక్రమాలను మాత్రమే ప్రచారం చేసుకోవడం ఏమిటని, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ఆమె నిలదీశారు. సొంత సామాజిక మాధ్యమ ఖాతాల్లో ప్రభుత్వ పనితీరు, కాంగ్రెస్ కార్యక్రమాల గురించి ఏం ప్రచారం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఒక్కో నియోజకవర్గంలో ‘సర్’పై కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తున్న తీరుపై తనవద్ద ఉన్న వివరాలతో ఆమె పలు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ‘సర్’కు సంబంధించి వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎందుకు వెనుకబడ్డారని ఎంపీ కడియం కావ్యను మీనాక్షి అడిగారు. తన లోక్సభ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తృతంగా తిరిగి ‘సర్’పై స్థానిక నేతలతో కలసి పనిచేస్తున్నట్లు కావ్య ఆమెకు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande