
హైదరాబాద్, 15 జూలై (హి.స.)
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక (Special Intensive Revision) సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక ప్రకటన చేసింది. బూత్ స్థాయి అధికారులు (BLOs) ఇప్పటికే జూన్ 25 నుంచి ప్రారంభించిన ఇంటింటి సర్వే ప్రక్రియ ఆగస్టు 3 వరకు కొనసాగుతుందని ప్రకటించింది. దీనికి సంబంధించి సరికొత్త షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 10న రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల ముసాయిదా జాబితా (Draft Publication) అధికారికంగా విడుదల కానుంది. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత, కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు, మార్పులు- చేర్పులకు సంబంధించిన అభ్యంతరాల (Claims & Objections) స్వీకరణకు ఎన్నికల సంఘం నెల రోజుల పాటు గడువునిచ్చింది. ప్రజలు ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు తమ దరఖాస్తులను సమర్పించే అవకాశం కల్పించారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలకు సంబంధించిన నోటీసుల జారీ, వాటి పూర్తి స్థాయి పరిష్కార ప్రక్రియను ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8 వరకు అధికారులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా ముగిసిన తర్వాత తుది ఓటర్ల జాబితాను (Final Publication) అక్టోబర్ 12న అధికారికంగా ప్రకటించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..