
కడప , 15 జూలై (హి.స.): కడప జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ఏపీ కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. కడప జిల్లాలోని మైలవరం మండలం, చిన్నకొమెర్ల సమీపంలో ప్రతిష్టాత్మక దాల్మియా సిమెంట్ (Dalmia Cement) రెండో ప్లాంట్ విస్తరణ పనులకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు బుధవారం శంకుస్థాపన చేశారు.
కాగా దాల్మియా సిమెంట్ సంస్థ తన రెండో ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఏకంగా రూ.3,100 కోట్ల భారీ పెట్టుబడితో ఈ విస్తరణ పనులను చేపడుతోంది. ఈ ప్లాంట్ విస్తరణ పనులు పూర్తి కావడం ద్వారా స్థానికంగా కొత్తగా 700 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
శంకుస్థాపన అనంతరం మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఏపీని పారిశ్రామికంగా అగ్రగామిగా నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాయలసీమకు మరిన్ని పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థానిక యువతకు సొంత జిల్లాల్లోనే ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని, దాల్మియా సిమెంట్ విస్తరణకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV