
రాజమండ్రి, 16 జూలై (హి.స.)
:రాయలసీమ కరవు నివారణకు గోదావరి జలాలు శాశ్వత పరిష్కారమని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్వ్యాఖ్యానించారు. పోలవరానికి కేంద్రం భారీ మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. ఈరోజు (గురువారం) పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్రపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టు కోసం రూ.20,700 కోట్లను కేంద్రప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి తెలిపారు. మరో రూ.30 వేల కోట్లు ఇచ్చేందుకు కూడా కేంద్రం అంగీకరించిందని చెప్పుకొచ్చారు. రాయలసీమకు గోదావరి జలాలు తీసుకెళ్లటం వల్ల కరవు పరిస్థితులు నుంచి ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. బీజేపీ పోలవరం సందర్శన యాత్రలో లోటుపాట్లను పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురైంది: మాధవ్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురైందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి 80 శాతం పనులు పూర్తి అయ్యాయని వివరించారు. పదిరోజుల్లో ఎడమ ప్రధాన కాలువ నుంచి నీళ్లు విడుదల చేస్తామని మాధవ్ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ