
హైదరాబాద్, 16 జూలై (హి.స.)రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఎల్ నినో లాంటి కరువు పరిస్థితుల్లోనూ ఏపీ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తుందన్నారు. పట్టిసీమ నుంచి రైతులకు నీళ్లు అందిస్తుందని వివరించారు. న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్.. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను కూటమి సర్కారు సాధిస్తుందని పేర్కొన్నారు. తాము 10 నుంచి 15 మంది ఎంపీలను గెలిస్తే కీలకంగా మారతామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ప్రజలతో చెలగాటమాడుతున్నాడని మండిపడ్డారు.
కన్నెపల్లి వద్ద రోజుకు మూడు టీఎంసీల నీటిని వాడుకోవచ్చునని కేటీఆర్ చెప్పారు. రోజుకు 28 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల ఎకరాల్లో మాత్రమే ధాన్యం పండేదని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారం దిగిపోయే నాటికి తెలంగాణలో కోటి యాభై లక్షల ఎకరాలలో ధాన్యం పండిందని వివరించారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర ఆదాయం రూ.4 వేల కోట్లు మాత్రమే ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయినప్పుడు రాష్ట్ర రెవెన్యూ రూ.18,500 కోట్లకు చేరిందని తెలిపారు.
తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆదాయం పెరిగింది.. దీనితోపాటు ఆస్తులు పెరిగాయి.. రాష్ట్ర అప్పు కూడా పెరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి పాలనలో అప్పులు మాత్రమే పెరిగాయి తప్ప ఆస్తులు పెరగలేదని వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది.. ప్రజల ఆదాయం కూడా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాలలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. హైదరాబాద్లో కాగ్నిజెంట్ సంస్థకు స్థలం కేటాయిస్తే ఇప్పుడు ఆ సంస్థ చెన్నైకి వెళ్ళిపోయిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వెనకాల సెటిల్మెంట్లు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. పారిశ్రామికవేత్తల తలలపై తుపాకులు పెట్టి బెదిరిస్తున్నారని స్వయంగా మంత్రి కొండ సురేఖ కుమార్తె చెప్పిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.
ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడోసారి అధికారంలోకి రాకపోవడమే మంచిది అయిందని అన్నారు. తమ కళ్లు నెత్తికెక్కాయని పేర్కొన్నారు. అందుకే మూడోసారి ఓడిపోయామని చెప్పారు. ఓడిపోవడానికి మా తప్పులు కూడా ఉన్నాయని వివరించారు. కొన్ని సెక్టార్లు, వర్గాలను పట్టించుకోలేదని తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలను కూడా మార్చి ఉంటే బాగుండేది అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్పై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదని కేటీఆర్ తెలిపారు. ఆయన మా ఎంపీ అని గుర్తు చేశారు. గతంలో ఓ కార్యక్రమంలో ఎదురుపడినప్పుడు ఆయన్ని తాను పలకరించానని కేటీఆర్ వివరించారు. కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నేతల కుటుంబ సభ్యులు కూడా అప్రమత్తంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. అందరి మీద ప్రజల దృష్టి ఉంటుందని పేర్కొన్నారు. ఆయన మీద తనకు సానుభూతి ఉందన్నారు. వివాదం జరిగినప్పుడే రాజీనామా చేసి ఉంటే రాజకీయ నాయకుడిగా బండి సంజయ్కి గొప్ప పేరు వచ్చేదని తెలిపారు. అది ముగిసిపోయిన అంశం తాను ఇప్పుడు బండి సంజయ్ రాజీనామా డిమాండ్ చేయడం లేదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్