అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 5 కొత్త కోర్సులు.. యూజీసీ అనుమతి
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU)కి కొత్తగా ఐదు కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆమోదం తెలిపింది.
Ambedkar


హైదరాబాద్, 16 జూలై (హి.స.)డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU)కి కొత్తగా ఐదు కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయం వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి వెల్లడించారు. ఈ ఐదు కోర్సులకు ప్రొఫెషనల్, అకడమిక్ రంగాల్లో డిమాండ్ ఉందని తెలిపారు. యూజీసీ ఆమోదం తెలిపిన కొత్త కోర్సుల్లో ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ ఎడ్యుకేషన్ (స్కూల్ అడ్మినిస్ట్రేషన్), మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (MSW), ఎమ్మెస్సీ జాగ్రఫీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్ ) ఉన్నట్లు వివరించారు.

యూజీసీ నిపుణుల కమిటీ జూన్లో వర్చువల్గా తనిఖీ చేసిందని.. వర్సిటీలోని మౌలిక వసతులు, అధ్యాపక సిబ్బంది, ఇతర అన్ని అంశాలను పరిశీలించి ఈ కోర్సులకు ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ అనుమతులు రావడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు ఉందన్నారు. విద్యా శాఖ కార్యదర్శి డా. యోగితా రాణా టీచర్లకు ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా ప్రత్యేక ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అందించాలనే ఉద్దేశంతో కోర్సుల్ని రూపొందించగా.. యూజీసీ వాటికి ఆమోదం తెలిపిందన్నారు. ఈ కోర్సులకు ఆమోదం పొందిన నేపథ్యంలో యోగితా రాణా, యూజీసీకి చక్రపాణి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కొత్త కోర్సులు అభ్యసించేందుకు కనీస విద్యార్హతలు, అడ్మిషన్ విధానం, ఫీజుల వివరాలు, కోర్సు వ్యవధి, స్టడీ సెంటర్లు తదితర వివరాలతో వర్సిటీ త్వరలోనే అడ్మిషన్ నోటిఫికేషన్ ఇస్తుందని తెలిపారు. ఏదైనా సమాచారం కోసం తమ వర్సిటీ వెబ్సైట్లు http://braou.ac.in, http://braouonline.inను సందర్శించవచ్చని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande