
హైదరాబాద్, 16 జూలై (హి.స.)కొంతమంది బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైదాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యం తీరుపై ధ్వజమెత్తారు. ఈరోజు(గురువారం) హైదరాబాద్ వేదికగా మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. కల్మా సూరహ్ ఫతే చదవాలని హుకుం జారీ చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. సోకాల్డ్ సెక్యూలర్ సంఘాలు ఎందుకు నోరు మెదపడం లేదు? అని ప్రశ్నించారు.హిందూ సమాజమంతా ముక్తకంఠంతో ఈ విషయాన్ని ఖండించాలని అన్నారు.సైదాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తే... తెలంగాణ అంతటా ఇదే సంస్కృతి విస్తరించే ప్రమాదం ఉందని బండి సంజయ్ హెచ్చరించారు. ఆటోడ్రైవర్ భరత్ను వేధించిన పోలీసులు, మజ్లిస్ నాయకులపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. భరత్ రాసిన దాంట్లో తప్పేముంది? అని ప్రశ్నించారు. హిందువులను కించపరిచేలా ఉర్దూలో ఆటోల్లో, గోడలపై రాసుకున్న వాళ్లపై ఎందుకు కేసులు పెట్టడం లేదు? అని నిలదీశారు. వాళ్లకో న్యాయం? భరత్కు ఇంకో న్యాయమా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. హిందూ విద్యార్ధులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తామని స్పష్టం చేశారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను పాటించేలా చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్