
కరీంనగర్, 16 జూలై (హి.స.)రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యం పంటకు బోనస్ అందించేందుకు కొత్త నిబంధనలను విధించింది. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి ప్రభుత్వం సూచించిన ధాన్యానికే బోనస్ చెల్లించనుంది. ప్రభుత్వం ఏడు రకాల వరి వంగడాలను సాగుచేయాలని సూచించింది. ఖరీఫ్ కాలంలో పండించిన ధాన్యానికి బోనస్ పొందాలంటే ప్రభుత్వం నిబంధనల మేరకు సన్న రకాల వరి పంటలను సాగు చేయాల్సి ఉంటుంది. పంట చేతికి వచ్చిన తరువాత పంట రకాన్ని బట్టి బోనస్ చెల్లిస్తారని వ్యవసాయ అధి కారులు చెబుతున్నారు.
విత్తనాలను కొను గోలు చేసిన వెంటనే దుకాణదారుడు తప్పని సరిగా ఆన్లైన్లో నమోదు చేయాలి. అందుకు ప్రభుత్వం దుకాణదారుడికి డిజిటల్ లాగిన్ను ఇస్తుంది. ధాన్యం కొనుగోలు చేసే రైతులు వివరాలను పాస్బుక్ ఆధారంగా నమోదు చేస్తారు. విత్తనాల కొనుగోలు వివరాలను వ్యవసాయ శాఖ కార్యాలయానికి పంపిస్తారు. ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలను ఏఈవోలు పంటల నమోదులో సరి చూసుకుంటారు.
కొనుగోలు చేసిన విత్తనాల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయకపోతే బోనస్ వచ్చే అవకాశం ఉండదు. ప్రభుత్వం ఏడు రకాల వరి వంగడాలను పండించాలని సూచిందింది. వీటికి మాత్రమే బోనస్ చెల్లించనున్నారు. ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, బీపీటీ 5204, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరాం, డబ్ల్యుజీఎల్ 44 (సిద్ది), కేఎన్ఎం 7715 వరి వంగడాలను వాడాలని ప్రభుత్వం రైతులకు సూచించింది.
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్