
కర్నూలు, 16 జూలై (హి.స.) వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. వర్షాలు లేక అటు రైతులు ఇటు ప్రజలు అల్లాడుతున్న నేపథ్యంలో ఇవాళ, రేపు వానలు పడతాయని స్పష్టం చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి 2,3 రోజుల్లో బెంగాల్ మీదుగా తూర్పు భారతం వైపు ప్రయాణించబోతున్నట్లు వెల్లడించింది.
దీని ఎఫెక్ట్ తో నేడు, రేపు ఉత్తర కోస్తాలో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కారణంగా రుతు పవనాలలో కదలిక రావచ్చని అంచనా వేసింది వాతావరణ శాఖ. అయితే దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మరో ఆరేడు రోజులు వడగాల్పులు, ఎండ తీవ్రత కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది. ఇది ఇలా ఉండగా, వర్షాకాలం ప్రారంభమై దాదాపు రెండు నెలలు పూర్తయినా కూడా.. వానలు సరిగ్గా పడకపోవడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అటు మొలకెత్తిన పంటలు కూడా ఎండకు మాడిపోతున్నాయి. ఈ క్రమంలో రైతులు కూడా లబోదిబోమంటున్నారు. వరుణ దేవుడు కరుణించాలని కోరుతున్నారు. నిత్యం పూజలు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV