
గన్నవరం, t, 17 జూలై (హి.స.)
:అప్పటి వరకూ సరదాగా సాగిన క్రికెట్ మ్యాచ్.. ఫలితం అనంతరం జరిగిన గొడవతో విషాదాంతమైంది. ఓ విద్యార్థి ప్రాణం బలైంది. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గన్నవరంలోని వీఎన్పురం కాలనీకి చెందిన ఈడే దుర్గ పవన్కుమార్ లారీ డ్రైవర్. ఆయన కుమారుడు వెంకట రామ్చంద్ (17) ఇంటర్ పూర్తి చేశాడు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం గన్నవరం బాలుర జడ్పీహైస్కూల్ క్రీడా ప్రాంగణంలో క్రికెట్ ఆడేందుకు వచ్చాడు. రూ.400 బెట్తో వెంకట రామ్చంద్, గన్నవరానికి చెందిన చిమట గోపీచంద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో గోపీచంద్ టీమ్ గెలుపొందింది. దీంతో గెలిచిన టీమ్ సభ్యులు ఎగతాళి చేయడంతో వెంకట రామచంద్ ఆవేశంతో గోపీచంద్ను బ్యాట్తో కొట్టాడు. పక్కనే ఉన్న ఆనంద్, రాకేశ్లు తన చేతిలోని బ్యాట్తో రామ్చంద్ను కొట్టారు. కిందపడిపోయిన రామచంద్ను గోపీచంద్... బ్యాట్తో బలంగా తలపై బాదడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. అక్కడ ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ.. మృతి చెందాడు. రామ్చంద్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ