
హైదరాబాద్, 17 జూలై (హి.స.)రాష్ట్రంలోని 90% అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్తు సౌకర్యం లభించిందని, త్వరలోనే నూరు శాతం కల్పిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. 6నెలల కాలంలో 9,800 కేంద్రాలకు విద్యుత్తు సౌకర్యం అందించామని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో 35,781 కేంద్రాలు ఉంటే.. ప్రస్తుతం 32,109 కేంద్రాలకు విద్యుత్తు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గతంలో 40% కేంద్రాలకు కూడా విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో చిన్నారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందిపడ్డారు. చీకటి గదులు, ఉక్కపోతతో అంగన్వాడీ కేంద్రాలకు రావాలంటే భయపడే పరిస్థితులు ఉండేవి. దీంతో డిజిటల్ బోధనకు ఆస్కారం లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్తు అమలు చేస్తున్నాం. విద్యుత్తు మౌలిక సదుపాయాలు కల్పించి, 11,194 కేంద్రాలకు కొత్త కనెక్షన్లు ఇచ్చాం’’ అని సీతక్క ప్రకటనలో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్