
హైదరాబాద్, 17 జూలై (హి.స.)ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల గుర్తింపు ఆధారిత వివక్షకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. రోహిత్ వేముల తెలంగాణ(ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ) బిల్లు, 2026 రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం సచివాలయంలో భట్టి అధ్యక్షతన జరిగింది. ఉపసంఘం సభ్యులైన మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
భట్టి మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో జరిగిన రోహిత్ వేముల విషాద ఉదంతం దేశం మొత్తాన్ని కదిలించింది. భవిష్యత్తులో ఎటువంటి వివక్ష లేని విద్యా విధానాన్ని, చట్టాన్ని తీసుకువస్తామని ఆనాడు ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చడానికి రోహిత్ వేముల చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తోంది. కొత్త చట్టానికి సంబంధించిన సమగ్ర విధివిధానాలతో కూడిన ప్రాథమిక ముసాయిదా నివేదికను ముందుగా సిద్ధం చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి బిల్లును త్వరలోనే శాసనసభలో ప్రవేశపెడతాం’’ అని అన్నారు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా ఈ చట్టాన్ని రూపొందించేందుకు సుప్రీంకోర్టు అడ్వొకేట్, సామాజిక కార్యకర్త దిశా వాడేకర్ను ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఈ సమావేశానికి పిలిపించి చర్చించినట్లు భట్టి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్