70 ఏళ్ల చరిత్రలో జులై నెలలో గోదావరి నదికి ఇంత తక్కువ ఇన్ఫ్లో రావడం మొదటి సారి
70 ఏళ్ల చరిత్రలో జులై నెలలో గోదావరి నదికి ఇంత తక్కువ ఇన్ఫ్లో రావడం మొదటి సారి
godavari


అంబేద్కర్ కోనసీమ, 17 జూలై (హి.స.)

జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీటి నిర్వహణను పర్యవేక్షించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బైక్పై ప్రయాణించారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొత్తపేట, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని గోదావరి సెంట్రల్ డెల్టా కాలువల వెంబడి ఆయన పర్యటన సాగింది. ఈ సందర్భంగా లాకుల నీటిమట్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొత్తపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి నల్ల లాకులను తనిఖీ చేశారు.

70 ఏళ్ల చరిత్రలో జులై నెలలో గోదావరి నదికి ఇంత తక్కువ ఇన్ఫ్లో రావడం ఇదే మొదటిసారని ఈ సందర్భంగా మంత్రి నిమ్మల పేర్కొన్నారు. 70 శాతం కాలువలు, 30 శాతం వర్షాలపై ఆధారపడి డిజైన్ చేసిన డెల్టాలో ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ముఖ్యంగా కాకినాడ రూరల్, అమలాపురం, ముమ్మిడివరం శివారు ప్రాంతాల్లో ఉన్న నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

సూపర్ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో నీటి దుర్వినియోగాన్ని అరికట్టి, ప్రతి చుక్కనూ పొదుపు చేసేలా అధికారులు, రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. పైస్థాయి నుంచి కింది స్థాయి వరకూ ఇరిగేషన్ అధికారులు నిరంతరం కాలువలను పర్యవేక్షిస్తూ.. రెవెన్యూ, నీటి సంఘాల సమన్వయంతో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. నీటి నిర్వహణను విజయవంతం చేయడం ద్వారా ఎల్నినో సవాలును అధిగమించడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande