
హైదరాబాద్, 17 జూలై (హి.స.)రాష్ట్రంలోని యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, ఉద్యోగం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని శక్తి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. జర్మన్, జపనీస్ తదితర విదేశీ భాషల్లో శిక్షణ అందించేందుకు ఇఫ్లూతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆధునిక నైపుణ్య శిక్షణ అందించేందుకు 54 కొత్త ఏటీసీలు ఏర్పాటు చేశామన్నారు. వచ్చే ఏడాది 50వేల మందికి శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. జులై, ఆగస్టు నెలల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించి 10వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. శుక్రవారమిక్కడ డీఈటీ ఆధ్వర్యంలో ఆదివాసీ భవన్లో నిర్వహించిన తెలంగాణ స్కిల్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏటీసీల ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు, విదేశీ ఉపాధి అవకాశాల కోసం ఎంపికైన 19 మంది ఫిజియోథెరపిస్టులకు ఆఫర్ లెటర్లు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ‘‘తెలంగాణను నం.1 నైపుణ్య రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలుగా అభివృద్ధి చేశాం. ఉట్నూరు, వరంగల్, నిజామాబాద్, హుస్నాబాద్ ప్రాంతాల్లో నిర్వహించిన ఏడు జాబ్మేళాల్లో 2,572 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా.. 1,775 మంది ఎంపిక అయ్యారు’’ అని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్