
హైదరాబాద్, 17 జూలై (హి.స.)హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబరు 13లో బంజారా లేక్ను ఆనుకుని ఉన్న 3.63 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా గురువారం కాపాడింది. దీని విలువ రూ.600 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. నిజాం కాలంలో జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ లే ఔట్లో అన్ రికగ్నైజ్డ్ ప్లాట్గా మిగిలిన ఈ భూమి కోర్టు వివాదంలో ఉంది.
ఈ భూమిని ఆక్రమించుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారని బంజారాహిల్స్ లేక్ పరిరక్షణ సమితితో పాటు స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ భూమిని కాపాడడంతో పాటు చెరువును అభివృద్ధి చేయాలని కోరారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో హైడ్రా పరిశీలించింది. కోర్టు వివాదం తేలేలోపు ఎవరూ కబ్జా చేయకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసింది. కేసు వివరాలను పొందుపరుస్తూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.
వెంకటాద్రినగర్లో పార్కును..
రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం మామిళ్ల గ్రామ పరిధిలోని వెంకటాద్రినగర్లో 800 గజాల పార్కును హైడ్రా గురువారం కాపాడింది. 1975లో 7.20 ఎకరాల పరిధిలో 118 ప్లాట్లతో లే ఔట్ వేయగా, అందులో 800 గజాలను పార్కు కోసం కేటాయించారు. ఆ స్థలాన్ని ప్లాట్లుగా చేసి లే ఔట్ వేసిన వాళ్లు అమ్మేశారు. దానిమీద కొందరు బ్యాంకు రుణాన్ని కూడా తీసుకున్నారు. రుణం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకర్లు విచారించగా అది పార్కు స్థలంగా తేలింది. ఇంతలో మరో వ్యక్తి రంగప్రవేశం చేసి బ్యాంకు రుణం చెల్లింపును తక్కువ మొత్తంలో సెటిల్ చేసుకుంటానని ఆ భూమిలో ప్రీకాస్ట్ వాల్స్ నిర్మించి ఆక్రమణలో ఉన్నారు.
ఇదే సమయంలో పార్కు స్థలంగా కోర్టు నిర్ధారించింది. అయినప్పటికీ ఖాళీ చేయకపోవడంతో స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా ఆక్రమణలు తొలగించింది. 800 గజాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థలంగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ స్థలం విలువ దాదాపు రూ.3 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. అలాగే, మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ మండలం అనఘాపురి కాలనీలో కబ్జాకు గురైన 500ల గజాల చొప్పున ఉన్న రెండు పార్కులను హైడ్రా కాపాడింది. ఆ భూమి విలువ దాదాపు రూ. 6 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్