
హైదరాబాద్, 17 జూలై (హి.స.)వర్షాలు పడకపోవడంతో ఎన్నడూ లేని విధంగా జూలై చివర కూడా ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. కొండాపూర్ డివిజన్ పరిధిలో ఉన్న కాలనీవాసులకు నీటి సరఫరా తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా బోరు బావులు పూర్తిగా ఎండిపోయాయి. స్థానికులు మొత్తం ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. కులాయిల నీటి సరఫరా గంట నుంచి అరగంటకు కుదించారు. పై నుంచి నీటి సరఫరా తగ్గడంతో తప్పనిసరి పరిస్థితిలో కులాయిలకు సరఫరా సమయాన్ని తగ్గించాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు.
కొండాపూర్ తులిప్ వద్ద ఓవర్హెడ్ ట్యాంకుకు మెయిన్ రిజర్యాయర్ నుంచి ఫిబ్రవరి వరకు 19 గంటలు నీటిని సరఫరా చేసేవారు. కానీ ప్రస్తుతం 14 గంటలు మాత్రమే సరఫరా జరుగుతుందని తెలిపారు. ఈ ఓవర్ హెడ్ ట్యాంకు నుంచే దాదాపు 10 నుంచి 15 కాలనీలకు కులాయిల ద్వారా, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గత సంవత్సరం జూలైలో కేవలం 40 ట్యాంకర్ల నీటి సరఫరాకు డిమాండ్ ఉండేది. కానీ ఈ జూలైలో మాత్రం ప్రతీ రోజు 200 ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. పై నుంచి నీటి పరిణామం తగ్గి వినియోగదారుల నీటి అవసరాలు పెరగడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వర్షాలు పడితే కానీ ఈ పరిస్థితి మారదని అధికారులు అంటున్నారు.
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్