
హైదరాబాద్, 17 జూలై (హి.స.)భారత్-యూకేల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం వల్ల తెలంగాణ గరిష్ఠ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందం వల్ల దేశం నుంచి ఎగుమతయ్యే 99% పారిశ్రామిక ఉత్పత్తులపై యూకే సుంకాలను తొలగించిందన్నారు. యూకే డిప్యూటీ ట్రేడ్ కమిషనర్(దక్షిణాసియా) చంద్రు కె అయ్యర్తో గురువారం సచివాలయంలో ఆయన భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, యూకే ప్రతినిధి బృందం సిద్ధార్థ్ విశ్వనాథన్, నళిని రఘురామన్, ప్రవీణ్ పద్మనాభన్, పరిశ్రమలశాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ‘తెలంగాణలో పారిశ్రామిక వస్తు ఉత్పత్తి, లైఫ్ సైన్సెస్, ఏవియేషన్, డిఫెన్స్, ఐటీ, సెమికండక్టర్స్, చిప్ల డిజైన్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయి. యూకే పారిశ్రామికవేత్తలు వీటిని వినియోగించుకోవాలి. రాష్ట్రం నుంచి యూకేకు ప్రస్తుతం రూ.3,553 కోట్ల విలువైన ఎగుమతులు మాత్రమే జరుగుతున్నాయి. కొత్త ఒప్పందం వల్ల ఎగుమతులను భారీగా పెంచుకునే అవకాశం ఏర్పడింది. స్థానిక పారిశ్రామికవేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలి’ అని అధికారులను మంత్రి ఆదేశించారు. యూకే నుంచి భారత్లో పర్యటించనున్న మేయర్ల బృందం హైదరాబాద్ను కూడా సందర్శించేలా చూడాలని చంద్రు అయ్యర్ను మంత్రి కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్