
హైదరాబాద్, 26 జూలై (హి.స.)
నకిలీ కరెన్సీని రసాయనాల
సహాయంతో రెట్టింపు చేస్తామని నమ్మించి రూ.20 లక్షలు కాజేసిన అంతర్రాష్ట్ర మోసగాళ్ల ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. జూలై 20న వ్యాపారవేత్త శ్రీ కృష్ణకాంత్ వడ్లాని మియాపూర్ పోలీసులను ఆశ్రయించారు. వ్యాపారవేత్తలుగా పరిచయం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు ముందుగా నల్లని కాగితాలను రసాయనాలతో ప్రాసెస్ చేసి కరెన్సీ నోట్లుగా మార్చినట్లు మాయాజాలం చేశారు. రూ.20 లక్షల నగదును ఒక పెట్టెలో ఉంచి, ప్రత్యేక రసాయనం తీసుకొచ్చే వరకు పెట్టెను తెరవవద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత పెట్టెను తెరిచి చూడగా నగదుకు బదులుగా తెల్ల కాగితాలు, రంగుల ఫోటో కాపీ షీట్లు మాత్రమే ఉండటంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మోసం చేసి కాజేసిన నగదుతో పాటు రసాయనాలు, నల్ల కాగితాలు తదితర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో టూరే ఎల్ హాడ్జీ మహమనే @ ఫోకౌ, టమెన్ రోమువాల్డ్ అలియాస్ రోలిన్ (49), ప్రస్తుతం అత్తాపూర్లో నివాసం ఉంటుండగా, ట్చువాన్యు అడాల్ఫ్ అలియాస్ ఔరామ్ (62) న్యూఢిల్లీ వసంత్ కుంజ్లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరు కామెరూన్, మాలి దేశాలకు చెందిన వారని తెలిపారు. డబ్బును రెట్టింపు చేస్తామంటూ వచ్చే ప్రలోభాలను నమ్మవద్దని సైబరాబాద్ పోలీసులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు