
హైదరాబాద్, 26 జూలై (హి.స.)
ఎన్నికల ఓటరు జాబితా ప్రత్యేక
సవరణ కార్యక్రమం (సర్-2026)ను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఎల్బీనగర్ జోన్ ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్టీ), జోనల్ కమిషనర్ వికాస్ మహతో, ఐఏఎస్ ఆదివారం కర్మన్ ఘాట్లోని క్రాంతి క్లబ్ను సందర్శించి కొనసాగుతున్న ప్రత్యేక సవరణ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు, ఓటరు వివరాల సవరణ, కొత్త దరఖాస్తుల స్వీకరణ, ఇంటింటి సర్వే, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ తదితర కార్యక్రమాల పురోగతిని ఆయన పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని, ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బూత్ లెవల్ అధికారులు (బిఎస్ఓ లు), ఎన్నికల సిబ్బందికి సూచించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పై ప్రజల్లో అవగాహన పెంచి, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యం కల్పించాలని సూచించారు. ఈ తనిఖీల్లో సంబంధిత ఎన్నికల అధికారులు, బూత్ లెవల్ అధికారులు (బీఎలీలు), సిబ్బంది పాల్గొన్నారు. సర్-2026 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ఖచ్చితమైన ఓటరు జాబితా రూపొందించేందుకు ఎన్నికల శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..