విదేశీ ఉద్యోగాల పేరుతో చీటింగ్: విజయవాడ దంపతులపై హైదరాబాద్లో కేసు
విదేశీ ఉద్యోగాల పేరుతో చీటింగ్: విజయవాడ దంపతులపై హైదరాబాద్లో కేసు
fraud


హైదరాబాద్, 26 జూలై (హి.స.)

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించిన విజయవాడకు చెందిన దంపతులపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. సౌజన్య, శ్రీనివాస్ అనే ఈ జంట బేగంపేటలో 'ఫ్లయింగ్ బోర్డర్ కన్సల్టెన్సీ' పేరుతో సంస్థను నడుపుతూ ఈ మోసాలకు పాల్పడినట్లు పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు.

బాధితుల కథనం ప్రకారం, ఈ దంపతులు విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు వసూలు చేశారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇప్పించకపోగా, కట్టిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి మోసం వల్ల తెలంగాణ వ్యాప్తంగా సుమారు 2,000 మంది ప్రభావితమై ఉండొచ్చని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే జంటపై గతవారమే విజయవాడలో ఇలాంటి మోసం కేసులోనే అరెస్ట్ అయ్యారని, బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్లీ మోసాలు కొనసాగిస్తున్నారని బాధితులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 318 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande