
భద్రాద్రి కొత్తగూడెం, 27 జూలై (హి.స.)
జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు, వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన ఆసుపత్రి నిర్వహణ, పరిశుభ్రత, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, సిబ్బంది హాజరు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. తనిఖీలో భాగంగా ఆసుపత్రిలోని అన్ని వార్డులు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రి ఆవరణ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోగులు ఆసుపత్రికి వచ్చిన నాటి నుంచి చికిత్స పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమోదవుతున్న ఓపీ వివరాలు, రోజువారీ రోగుల సంఖ్య, గత పది రోజులుగా నమోదైన జ్వర కేసులపై సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున జ్వరాలపై ప్రత్యేక అప్రమత్తతతో వ్యవహరించాలని, జ్వర లక్షణాలతో వచ్చే ప్రతి రోగికి అవసరమైన పరీక్షలు నిర్వహించి తక్షణమే చికిత్సఅందించాలని సూచించారు. గ్రామాల్లో జ్వరాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రక్త పరీక్షల విభాగాన్ని సందర్శించిన కలెక్టర్ మలేరియా, డెంగ్యూ, హెచ్ఐవీ నిర్ధారణకు అవసరమైన టెస్టింగ్ కిట్ల లభ్యత, నిర్వహిస్తున్న పరీక్షల వివరాలను తెలుసుకున్నారు.
పాము కాటుకు గురైన బాధితుల చికిత్సకు అవసరమైన యాంటీ స్నేక్ వెనం ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయా అని ప్రత్యేకంగా ఆరా తీశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆయుష్ క్లినిక్ను సందర్శించి అక్కడ అందిస్తున్న వైద్య సేవలు, నిల్వలో ఉన్న ఆయుష్ ఔషధాలను పరిశీలించారు. ప్రజలకు ఆయుష్ సేవలను కూడా సమర్థవంతంగా అందించాలని సూచించారు. తనిఖీ అనంతరం ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ వారికి అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్య సిబ్బంది స్పందనపై వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగేలా ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు, అవసరమైన మందులు, పరీక్షా సదుపాయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ శిరీష, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, వైద్యులు, సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..