రష్యా వ్యవసాయ భూముల పేరుతో రూ.1.10 కోట్ల సైబర్ మోసం
విదేశీ పెట్టుబడుల పేరుతో ఓ ప్రైవేట్ ఉద్యోగిని సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి బాధితుడి నుంచి ఏకంగా రూ.1.10 కోట్లు కాజేశారు.
Cyber crime


హైదరాబాద్, 27 జూలై (హి.స.)విదేశీ పెట్టుబడుల పేరుతో ఓ ప్రైవేట్ ఉద్యోగిని సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి బాధితుడి నుంచి ఏకంగా రూ.1.10 కోట్లు కాజేశారు. రష్యాలో వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తే తొలి మూడు నెలల్లోనే భారీ లాభాలు వస్తాయని నమ్మించి, దశలవారీగా బాధితుడి నుంచి నగదు దోచుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం నల్లగండ్ల హుడా కాలనీలో చోటుచేసుకుంది.

నల్లగండ్ల హుడా కాలనీకి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగిని సైబర్ కేటుగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. రష్యాలో వ్యవసాయ భూముల్లో పెట్టుబడి పెడితే 100 ఎకరాలకు తొలి మూడు నెలల్లోనే రూ.27 లక్షల వరకు లాభం వస్తుందని ఆశ చూపారు. భూముల యాజమాన్య హక్కులు పూర్తి పారదర్శకంగా ఉంటాయని, పెట్టుబడిదారులకు వాటాల రూపంలో హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, పెట్టుబడి ప్రక్రియను ప్రత్యక్షంగా చూపించేందుకు రష్యాకు తీసుకెళ్తామని చెప్పి బాధితుడిలో నమ్మకం కల్పించారు.

కేటుగాళ్ల మాటలను నమ్మిన బాధితుడు విడతల వారీగా మొత్తం రూ.1.10 కోట్లు బదిలీ చేశాడు. అనంతరం హామీ ఇచ్చిన లాభాలు రాకపోవడం, నిందితులు అందుబాటులో లేకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల బ్యాంకు ఖాతాలు, డిజిటల్ లావాదేవీలు, కమ్యూనికేషన్ వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. స్టాక్ మార్కెట్, విదేశీ పెట్టుబడులు, వ్యవసాయ భూములు, క్రిప్టో, షేర్లు లేదా ఇతర పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు వస్తాయని చెప్పే అపరిచిత వ్యక్తులు లేదా సంస్థలను గుడ్డిగా నమ్మవద్దని సూచించారు. పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత సంస్థల విశ్వసనీయతను అధికారికంగా ధ్రువీకరించుకోవాలని, అనుమానాస్పద ఆఫర్లు ఎదురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande