
హైదరాబాద్, 27 జూలై (హి.స.)
కేంద్రంలోని ఎన్డీయే (NDA) కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఢిల్లీలో నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై ఆందోళనలు చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కుమార్తె కేశినేని స్నిగ్ధ చేసిన సోషల్ మీడియా పోస్టులు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తరుణంలో, సొంత పార్టీ ఎంపీ కుమార్తెనే కేంద్ర నిర్ణయాలపై సెటైర్లు వేయడం హాట్ టాపిక్‌గా మారింది. దేశంలో పరీక్షల నిర్వహణలో విఫలమైన మంత్రిని జవాబుదారీతనం అడిగితే విద్యార్థులపై ఇంత క్రూరంగా లాఠీఛార్జ్ చేస్తారా అని, తాను ఎల్లప్పుడూ విద్యార్థుల పక్షాన నిలబడతానని ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా, మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఉద్దేశించి.. ఆయన కోసం రాజీనామా లేఖను ఏమైనా డ్రాఫ్ట్ చేయమంటారా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ పోస్టుల స్క్రీన్‌షాట్లు మరియు ఆమె ఆందోళనల్లో పాల్గొన్నట్లు ఉన్న ఫోటోలను వైఎస్సార్‌సీపీ (YSRCP) శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ చేస్తూ కూటమి ప్రభుత్వ ద్వంద్వ విధానాలను ఎండగడుతున్నాయి. ఈ అంశం రాజకీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారడంతో కేశినేని స్నిగ్ధ తన సోషల్ మీడియా ఖాతాల నుండి సదరు వివాదాస్పద పోస్టులన్నింటినీ పూర్తిగా డిలీట్ చేశారు. కేవలం స్నిగ్ధ మాత్రమే కాకుండా భువనేశ్వర్ బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి కుమార్తె అర్చితా సచిన్, అస్సాం ఏజీపీ మంత్రి కేశబ్ మహంత కుమార్తె దిబిసా మహంత కూడా ఈ విద్యార్థి ఉద్యమానికి సోషల్ మీడియా ద్వారా మద్దతు తెలపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi