
నిజామాబాద్ , 27 జూలై (హి.స.)
నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్ పీ) బ్యాక్‌వాటర్‌లో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు నీట మునిగి మృతి చెందారు. వీరితో పాటు వెళ్లిన మరో యువకుడు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే, ముప్కాల్ సమీపంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వెనుక జలాల్లోకి ఐదుగురు యువకులు ఈతకు వెళ్లారు. నీటి లోతును అంచనా వేయలేకపోవడంతో నలుగురు గల్లంతయ్యారు. వారిలో ఒకరు ప్రాణాలతో బయటపడి ఒడ్డుకు చేరుకున్నారు. అతని సమాచారంతో స్థానికులు వెంటనే స్పందించి గాలింపు చేపట్టారు.
కొద్దిసేపటికే నలుగురి మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతుల్లో ముగ్గురు నిజామాబాద్ పట్టణానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi