
కర్నూలు/అచ్చంపేట/విజయపురిసౌత్:, 29 జూలై (హి.స.)
కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆలమట్టి డ్యాంకు పెద్దఎత్తున వరద వస్తోంది. మంగళవారం ఉదయం 73,333 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. డ్యాం 95.777 శాతం నిండింది. సాయంత్రం 6 గంటలకు 80 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం గరిష్ఠ నీటి మట్టం 1704.81 అడుగులు, సామర్థ్యం 123.081 టీఎంసీలు కాగా.. 1703.85 అడుగుల వద్ద 119.065 టీఎంసీల వరద చేరింది. మరో నాలుగు టీఎంసీలు వస్తే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది.
-
నారాయణపూర్ జలాశయానికి 35 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. డ్యాం గరిష్ఠ నిల్వ సామర్థ్యం 33.313 టీఎంసీలకు గాను ప్రస్తుతం 32.37 టీఎంసీల నిల్వ ఉంది. ఆలమట్టి నుంచి భారీగా వరద వస్తుండడంతో 84,300 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. ఇదంతా జూరాలకే రానుంది.
-
జూరాల డ్యాంకు ప్రస్తుతం 18 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. నారాయణపూర్ నుంచి ఇన్ఫ్లో భారీగా పెరగడంతో నేడు జూరాల గేట్లు ఎత్తే అవకాశం ఉందని ఇంజనీర్లు తెలిపారు. డ్యాం గరిష్ఠ సామర్థ్యం 9.657 టీఎంసీలకు 8.611 టీఎంసీల నిల్వ ఉంది.
-
శ్రీశైలం డ్యాంలోకి మంగళవారం చుక్క కూడా ఇన్ఫ్లో లేదు. గరిష్ఠ నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా.. 41.279 టీఎంసీలే ఉంది.
-
ఇక తుంగభద్ర డ్యాంకు వరద నిలకడగా కొనసాగుతోంది. ఎగువ నుంచి 21,773 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. కాలువలకు 3,600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. డ్యాం గరిష్ఠ సామర్థ్యం 105.788 టీఎంసీలకు గాను ప్రస్తుతం 34.148 టీఎంసీలు చేరింది.
-
నాగార్జునసాగర్ గరిష్ఠ నిల్వ సామర్థ్యం 312.050 టీఎంసీలు.. మంగళవారం 136.993 టీఎంసీలు ఉంది. ఎగువ నుంచి 900 క్యూసెక్కులు వస్తుండగా.. ఎస్ఎల్బీసీ ద్వారా 900 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 45.770 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యం ఉన్న పులిచింతల ప్రాజెక్టులో మంగళవారం 29.07 టీఎంసీలు ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ