ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో వందల సీట్లు ఖాళీ
వరంగల్ నిట్లో 151.. ఏపీ నిట్లో 110.. సీశాబ్ కౌన్సెలింగ్ ప్రారంభం
Seats


హైదరాబాద్, 29 జూలై (హి.స.)దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(స్పా), కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో పెద్ద సంఖ్యలో సీట్లు మిగిలిపోయాయి. ఐఐటీలు సహా మొత్తం 138 సంస్థల్లో కలిపి 67,323 సీట్లకు ఇటీవల జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఐదు విడతల కౌన్సెలింగ్ నిర్వహించింది. ఐఐటీలను పక్కనబెడితే మిగిలిన సంస్థల్లో పెద్ద ఎత్తున సీట్లు భర్తీ కాలేదు. ఐఐటీలు మినహా ఇతర సంస్థల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీకి సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు(సీశాబ్) పేరిట ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తుంటారు. ఈ విద్యా సంవత్సరానికి(2026-27) ఐఐఈఎస్టీ, షిబ్పూరు ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 15 వేలకుపైగా సీట్ల వరకు మిగిలిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20 శాతం సీట్లు భర్తీ కాకపోవడం గమనార్హం. ఈనెల 31న మాక్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆ తర్వాత విద్యార్థులు వెబ్ ఆప్షన్లను మార్చుకోవచ్చు. ఆగస్టు 6న తొలి విడత, 12న తుది విడత సీట్లు కేటాయిస్తారు.

రాష్ట్రంలో ఎప్సెట్ రెండో విడత కౌన్సెలింగ్ దాదాపు పూర్తయింది. చివరి విడత కౌన్సెలింగ్ మొదలుకానుంది. ఈక్రమంలో సీశాబ్ ద్వారా సీట్లు వస్తే రాష్ట్రంలో ఇప్పటికే చెల్లించిన ఫీజు ఇస్తారా.. ధ్రువపత్రాలు వస్తాయా.. అన్న ఆందోళన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. దీనిపై ఎప్సెట్ క్యాంపు కార్యాలయ వర్గాలు మాట్లాడుతూ సీటు వచ్చినట్లు అలాట్మెంట్ లెటరు చూపితే ఫీజు తిరిగి ఇస్తామని, ధ్రువపత్రాలను కూడా ఆయా కళాశాలల నుంచి ఇప్పిస్తామని స్పష్టంచేశాయి. సీశాబ్లో సీట్లు కేటాయించిన రోజే వచ్చి సీట్ల రద్దుకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

______________

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande