
కామారెడ్డి, 29 జూలై (హి.స.)
బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రి
(ఎంసీహెచ్)లో సస్పెండ్ అయిన ఇద్దరు నర్సులకు మద్దతుగా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది బుధవారం రెండో రోజు కూడా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆసుపత్రి ఎదుట నిర్వహించిన ఆందోళనలో వైద్యులు, సిబ్బంది పాల్గొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీలత, డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ.. బాలింతల కేసు నేపథ్యంలో ఇద్దరు నర్సులను సస్పెండ్ చేయడం, మత్తు వైద్యుడిని విధుల నుంచి తొలగించడం అన్యాయమని ఆరోపించారు. ఒకవేళ విధి నిర్వహణలో లోపం జరిగినా ముందుగా మెమో జారీ చేసి వివరణ కోరాల్సి ఉంటుందని, నేరుగా సస్పెన్షన్ లేదా తొలగింపు చర్యలు చేపట్టడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.
ఇలాంటి చర్యల వల్ల వైద్య సిబ్బంది మనోధైర్యం దెబ్బతింటుందని, రోగులకు మెరుగైన సేవలు అందించడంపైనా ప్రభావం పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి అనేక మండలాల నుంచి రోగులు వస్తున్నారని, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది నిరంతరం సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. సస్పెండ్ అయిన ఇద్దరు నర్సులపై సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయడంతో పాటు, విధుల నుంచి తొలగించిన మత్తు వైద్యుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..