పర్యాటకులకు అలర్ట్.. బొగత జలపాతం సందర్శన నిలిపివేత
పర్యాటకులకు అలర్ట్.. బొగత జలపాతం సందర్శన నిలిపివేత
Waterfall


ములుగు, 29 జూలై (హి.స.)

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం (Deep Depression) ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా ములుగు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బొగత జలపాతం (Bogatha Falls) ఉధృతంగా ప్రవహిస్తోంది. అటవీ ప్రాంతంలో గత 10 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. బొగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు (Temporarilysuspended) ప్రకటించారు .

ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి వద్ద ఉన్న ఈ జలపాతాన్ని వీక్షించేందుకు అనునిత్యం వందలాది మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే, వర్షాల వల్ల రాళ్లు జారడం, నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉన్నందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వరద ఉధృతి తగ్గి, పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు పర్యాటకులు ఎవరూ జలపాతం వైపు రావొద్దని, పోలీసులు, అటవీ శాఖ అధికారుల ఆదేశాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జలపాతం పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande