కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించాలి: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించాలి: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
MLA


హుజురాబాద్, 29 జూలై (హి.స.)

సముద్రంలో కలిసిన ప్రతి నీటి చుక్క... హుజురాబాద్ రైతు కళ్లలో కన్నీటి చుక్కగా మారిందని, ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు... కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని తెచ్చిన 'కృత్రిమ కరువు' అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఆయన హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి గ్రామంలో ని బీడు పొలాల్లో పర్యటించి, సాగునీరు లేక బీడు గా మారిన వరి పొలాలను, ఎండిన బావులను, రైతుల దుస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి గారూ... మీరు కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి ఉంటే, ఆ నీరు వరుసగా అన్నారం బ్యారేజ్, సుందిళ్ల, ఎల్లంపల్లి, నందిమేడారం, మిడ్ మానేరు మీదుగా ఎస్ఆర్ఎస్పికి, అలాగే మల్లన్నసాగర్కు చేరేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం వల్ల నేడు లక్షలాది క్యూసెక్కుల కృష్ణా, గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. దాని ఫలితంగానే మా ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో అధికంగా వరి సాగు జరుగుతుందని, నీటి కొరత కారణంగా పొలాలన్నీ బీడుగా మారాయని ఎమ్మెల్యే తెలిపారు. కనీసం రైతులు నాట్లు కూడా వేయలేని పరిస్థితి నెలకొందన్నారు. బావుల్లో నీరు అడుగంటిపోవడంతో, నీటి కోసం క్రేన్లు వాడి బావులను మళ్లీ తవ్వుకోవాల్సిన దయనీయ పరిస్థితి రైతులకు వచ్చిందని, ఇది కాంగ్రెస్ పాలనలోని వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

హుజురాబాద్ నియోజకవర్గ రైతాంగం తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ... తక్షణమే కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్లను ప్రారంభించి, ఈ ప్రాంతానికి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎండిపోతున్న పంటలను కాపాడి, రైతాంగాన్ని ఆదుకోవాలని, లేనిపక్షంలో రైతుల తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande