బాన్సువాడ లో కార్డన్ సెర్చ్.. భారీ వర్షంలో సైతం పోలీసుల విస్తృత తనిఖీలు
బాన్సువాడ లో కార్డన్ సెర్చ్.. భారీ వర్షంలో సైతం పోలీసుల విస్తృత తనిఖీలు
Police


కామారెడ్డి, 29 జూలై (హి.స.) కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రాజారాం

దుబ్బ కాలనీలో బుధవారం ఉదయం పోలీసులు భారీ ఎత్తున కార్బన్ సెర్చ్(Cordon & Search) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ సుమారు 140 మంది పోలీసు సిబ్బంది కాలనీలోకి ప్రవేశించి విస్తృత తనిఖీలు చేపట్టారు. కార్డన్ సెర్చ్లో భాగంగా కాలనీలోని ప్రధాన రహదారులు, సందుల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, బీమా పత్రాలు తదితర ధ్రువపత్రాలను పరిశీలించారు. మొత్తం 112 మోటార్సైకిళ్లు, 5 కార్లు, 18 ఆటోలను తనిఖీ చేయగా, సరైన పత్రాలు లేని 13 మోటార్సైకిళ్లు, ఒక ఆటోను జప్తు చేశారు.

అదే సమయంలో కాలనీలోని ఇళ్లు, దుకాణాల్లో సోదాలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులను విచారించారు. ప్రతి ఇంటికి వెళ్లి నివాసితుల ఆధార్ కార్డులను పరిశీలించడంతో పాటు మహిళల భద్రత, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, గంజాయి వినియోగం, కాలనీలో నేరస్తుల సంచారం వంటి అంశాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, సీఐలు తుల శ్రీధర్, తిరుపయ్య, వివిధ మండలాల ఎస్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డీఎస్పీ విఠల్ రెడ్డి స్వయంగా తనిఖీలను పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ప్రజల భద్రతను మరింత పటిష్ఠం చేయడం, నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande